jQuery(document).ready(function($){$('#aside #lang_sel_list ul').addClass('fancy');});

Your browser (Internet Explorer 7 or lower) is out of date. It has known security flaws and may not display all features of this and other websites. Learn how to update your browser.

X

Navigate / search

ఆశ్రమాన్ని చేరుకొనేదెలా?

Tiruvanamalai

‘తిరువణ్ణామలై’గా పిలువబడే అరుణాచలం తమిళనాడులో ఉంది. చెన్నైకి 120 మైళ్ళు, కాట్పాడి జంక్షన్‌కు 60 మైళ్ళ దూరంలో వుంది. ఈ రెండుచోట్ల నుంచి నేరుగా చేరుకునే బస్‌లు చాలా తరచుగా నడుస్తాయి. అలాగే తిరుపతి నుంచి కూడా కాట్పాడి (వేలూర్‌) మీదుగా బస్‌లు 5 గం.లో చేరుస్తాయి. వైజాగ్‌, విజయవాడల నుంచి తిరువణ్ణామలై స్టేషన్‌ మీదుగా పోయే రైళ్ళు రెండున్నాయి (No 22603/5, 22604/5). హైదరాబాద్ (లకడీ-కా-పుల్) నుంచి డైరెక్టు బస్ రోజూ నడుస్తోంది అలాగే ఇక్కడినుంచి తమిళనాడు, పొరుగు రాష్ట్రాలకు నేరుగా పోయే బస్‌లు, రైళ్ళు అసంఖ్యాకంగానే వున్నాయి. ఆశ్రమం – బస్‌స్టాండ్‌ నుంచి 3 కి.మీ. రైల్వేస్టేషన్‌ నుంచి 4 కి.మీ. పెద్దగుడి దక్షిణ గోపురంనుంచి 2 కి.మీ. దూరంలో వుంది.

వాతావరణం:

ఏడాది పొడుగునా వేడిగా, పొడిగా ఉంటుంది. వేసవి తీవ్రంగానే ఉంటుంది. ఏప్రిల్‌-జూన్‌లో అధిక వేడి కనిపిస్తుంది.
జూన్‌ – జూలైలలో కొంత జల్లులు మొదలై వేడి తగ్గుతుంది. అక్టోబర్‌ – నవంబర్‌ ప్రాంతంలో వర్షాలు కనబడే అవకాశముంది. డిసెంబర్‌-ఫిబ్రవరిలో వాతావరణం బహుప్రసన్నంగా చల్లగా వుంటుంది.

ఆశ్రమ ప్రవేశం

బెంగళూరు రోడ్డులో కుడిపక్కగా వున్న ఆశ్రమంవద్ద వాహనం దిగి శ్రీరమణాశ్రమం అని రాసివున్న కమాన్‌ (గేట్‌పైన ఆర్చ్‌) లోంచి ఆశ్రమంలో ప్రవేశించగానే సువిశాలమైన ప్రాంగణంలో అడుగుపెడతారు. నాలుగువందల సంవత్సరాల విప్పచెట్టుతో సహా మామిడి, బాదం తదితర మహావృక్షాల నీడతో పురాతనమైన వాతావరణమేదో స్ఫురిస్తుంది. ఈ ఆవరణ ప్రతి ఉదయం 10.30కు నారాయణసేవతో కళకళలాడుతుంది. ఎదురుగా మెట్లు, తరువాత ఎడమపక్క రెండు గోపురాలు. మొదటిది భగవానుల మాతృమూర్తి సమాధి సన్నిధి శ్రీమాతృభూతేశ్వరాలయం. రెండవది భగవాన్‌ శ్రీరమణ మహర్షుల సన్నిధి శ్రీరమణేశ్వరాలయం.

కొత్త హాల్‌

తూర్పు ముఖద్వారంగల మాతృభూతేశ్వరాలయంలో ప్రవేశిస్తే మొదట ‘కొత్త హాల్‌’: అందులో కుడిపక్క దక్షిణాభిముఖంగా, చక్కగా చేయబడిన రాతిసోఫాలో పద్మాసనంలో కూచున్న శ్రీభగవాన్‌ల రాతివిగ్రహం. పెరుగుతున్న భక్తుల వసతికోసమై నిర్మించబడిన ఈ కొత్త హాల్‌లో స్వామి మహానిర్వాణానికి ముందు కొద్ది నెలల కాలం నివాసమున్నారు. ఉదయం 5-12.30; మధ్యాహ్నం 2-9 తెరచి ఉంచుతారు.

మాతృభూతేశ్వరాలయం

కొత్త హాల్‌లో పడమరగా ఉన్న రెండో పెద్దద్వారం శ్రీమాతృభూతేశ్వర మహాసన్నిధానానికి దారితీస్తుంది. ప్రఖ్యాత శిల్పి వైద్యనాథ స్థపతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ అద్భుత నిర్మాణం రూపుదిద్దుకొంది. గర్భగృహంలో శ్రీమాతృభూతేశ్వర లింగం, గోడలో అమర్చిన శ్రీచక్ర మహామేరు యంత్రం, మరో భూప్రస్థార యంత్రం భగవానుల స్పర్శతో పునీతమై దర్శినమిస్తాయి. నవావరణ విధాన శ్రీచక్ర పూజ ప్రతి శుక్రవారం, పౌర్ణమి, తమిళ మాసాల మొదటిరోజున సాయంత్రం 6 గం. మొదలై, 3 గం. పాటు సాగుతుంది. గర్భాలయం గోడల వెలుపల దక్షిణామూర్తి, లింగోద్భవ మూర్తి, అక్ష కమండలు ధారి బ్రహ్మ, యోగాంబిక దర్శనమిస్తారు. నైఋతి, వాయువ్య మూలలలో గజానన, షడానన సన్నిధులున్నాయి. ఉత్తరాన సోమసూత్రానికి ఎదురుగా చండికేశ్వరుని సన్నిధి ఉంది. ఈశాన్యంలో నవగ్రహ మండపం, పక్కనే నటరాజ, శివకామనాయికిల పంచలోహ మూర్తులున్నాయి. పై కప్పుకు ఆధారంగా

ఉన్న రాతిస్తంభాలపై దేవీదేవతల విగ్రహాలు, ద్వారానికి ఇరుపక్కల పశ్చిమ ముఖంగా సూర్యచంద్రులు, గర్భాలయం ఎదురుగా పెద్దవేదికపై కొలువైన శ్రీనందికేశ్వరుడు విరాజమానమై ఉన్నారు. ఉదయం 5 – 12.30, మధ్యాహ్నం 3.30 – 8 వరకు తెరచి ఉంటుంది.

రమణుల సమాధి

మాతృభూతేశ్వర ఉత్తరద్వారంనుంచి మహర్షుల సమాధి మందిరంలోకి ప్రవేశిస్తాము. సన్నిధిలో మండపం, దానికి ఆచ్ఛాదనగా విమానం ఉన్నాయి. 4 గ్రానైట్‌ స్తంభాలీ విమానానికి ఆధారం. మండపం మధ్యలో పాలరాతి పద్మం, దానిమధ్యలో శివలింగం – శ్రీరమణేశ్వర మహాలింగం దివ్య తేజోమయంగా, ప్రసన్న జ్ఞాన కిరణాలను వెదజల్లుతూ, సందర్శకులలో మహద్భక్తి భావాన్ని ఆవిష్కరించే విధంగా దర్శనమిస్తుంది. ఈ మండపం చుట్టూతా, ఇంకా హాలులోను రమణుల పెద్ద పెద్ద ఫొటోలు సజీవమూర్తులై దీవిస్తాయి. 300మంది కూర్చోగల ముందుహాల్‌ కడప-చలువరాళ్ళతో ప్రకాశిస్తూంటుంది.

ఉదయం 5 – 12.30, మధ్యాహ్నం 2 – 9 వరకు తెరచి ఉంటుంది.

పాతహాల్‌

సమాధిహాల్‌ ఉత్తరద్వారంలోంచి నిర్గమిస్తే పెద్దనుయ్యి ‘అఘశమన’ లేక ‘రమణ’తీర్థం ఉంది. శ్రీరమణుల మహిమా ప్రసాదమైన ఈ జలాలను అభిషేకాదులకు వినియోగిస్తారు. ఎడమపక్కగా ఉన్నది పాతహాల్‌ లేక ధ్యాన మందిరం. భగవాన్‌ శ్రీరమణులు అత్యధిక భాగం ఈ హాల్‌లో సోఫాపై ఆసీనులై దర్శన, సత్సంగములను ప్రసాదించేవారు. ఆబ్రహ్మకీటక పర్యంతం అనేకులు వారిని దర్శించి, వారితో సంభాషించి, వారి అనుగ్రహానికి పాత్రులైనది ఇక్కడే. నేటికీ ఈ స్థానం సాధకులకు స్ఫూర్తిప్రదాయినిగా, సందర్శకులకు శాంతిప్రదాత్రిగా విరాజిల్లుతోంది.

ఈ హాలుకి ఉత్తరంగా చిన్నగోడ దాటగానే కొంత ఆవరణ, కొంత ఎత్తులో స్వామి స్పర్శదీక్షతో ముక్తిపొందిన కాకి, కుక్క, గోవు లక్ష్మి – మొదలైన జంతువుల సమాధులున్నాయి. గోలక్ష్మికి ప్రతి శుక్రవారం 7-15కు పూజాభిషేకాలు జరుగుతాయి. ఎడమపక్క బిల్డింగ్‌ – పాత డిస్పెన్సరీ హాల్‌, దాని నానుకొని పూదోట. సమాధుల వెనుక కొండపైనున్న స్కందాశ్రమానికి దారితీసే మెట్లు, వాటికి ఎడమపక్కన మురుగునార్‌ మొదలైన భక్తుల సమాధులు కన్పిస్తాయి.

భోజన హాల్‌

రమణతీర్థం నుయ్యికి ఉత్తరంగా ఉన్న పాత భోజనహాల్‌, దానిని ఆనుకొని నిర్మించిన కొత్తహాలు కలిపి సుమారు 7-8 వందల మంది భోంచెయ్యవచ్చును. పాతహాల్‌లో రమణులు భోజనంచేసే చోట ఓ పాలరాతి వేదిక, దానిపై శ్రీవారు భోంచేస్తున్న ఫొటో ఉన్నాయి. పాత భోజనహాల్‌ పక్కనే వంటశాల (కిచెన్‌) సర్వప్రకార ఆధునిక పరికర సమృద్ధితో అలరారుతుంది. దీని తూర్పు ద్వారం ఎదురుగా స్టోర్‌ రూం, దాని వెనకాల యజుర్వేద పాఠశాల, ఎదురుగా పురుషుల వసతి గృహం (ఉద్యోగులకు); ఈ రెండూ దాటాకా విశాలమైన ప్రాంగణంలో గోశాల, పురుషుల స్నానగదులు కనబడతాయి.

గోశాల
భగవాన్‌ ఆదరానుమతితో ఆశ్రమ ప్రవేశం చేసిన గోవు లక్ష్మి సంతతి, తదితర గోమాతల పాడితో దినదినాభివృద్ధి చెందినది ఆశ్రమ గోశాల. ప్రస్తుతం నూటికిపైగా గోసంతతి అందించే పాడియే అందరికీ పోషకామృతం.
వేదపాఠశాల: యజుర్వేద సంప్రదాయానుగుణంగా విద్యార్థులు శిక్షణ పొందుతారు.
నిర్వాణగది
శ్రీమాతృభూతేశ్వరాలయానికి తూర్పున, ఆఫీసు గదులకు
ఉత్తరంగాను చిన్నగది సర్వాలంకార శోభితంగా ఏదో ప్రత్యేకత ఉన్నట్లు తేజరిల్లుతుంటుంది. రమణుల అవసాన కాలం మరియు వారి మహానిర్వాణానికీ, ఈ గది వేదిక అయింది. ఇందులో వారిచే తయారుచేయబడిన, వారికి భక్తులు సమర్పించుకొన్న అనేక నిత్యవాడక వస్తువులు, తదితరాలు మెరుస్తూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.

దక్షిణాభిముఖంగా వున్న ఈ గదికి తూర్పున భగవాన్‌ సోదరుడు నిరంజనానంద స్వామిదీ, వారి ఏకైక పుత్త్రుడు శ్రీరమణానందసరస్వతీ స్వామి (టి.ఎన్‌. వేంకటరామన్‌)ల సమాధులున్నాయి. స్వామి నిరంజనానంద భగవానుల కాలంలో ఆశ్రమ సర్వాధికారి. వారి అనంతరం వేంకటరామన్‌ ఆశ్రమ అధ్యక్షులు. వీటి వెనకాల కొబ్బరితోట.

అతిథి గృహాలు
భగవాన్‌ నిర్యాణానంతరం ఆశ్రమప్రాంగణంలో ఎన్నో గదులు, గదుల సముదాయాలు, భవనాలు వెలిసాయి. ఆలయాల వెనుకగా ఉన్న పాలితీర్థం పడమర గట్టున కురంగు (కోతుల) తోట అనే గృహ సముదాయం ఉంది. ఆశ్రమ ఆవరణకు బయట రోడ్డుదాటితే, ‘మోర్వీ కాంపౌండ్‌’ అనే మరో సముదాయం. కొంచెం దూరంలోనే మరిన్ని అతిథి గృహాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశుభ్రంగా, కొద్దిపాటి సామానుతో, కరెంట్‌ వసతులతో సరిపడా వుంటాయి.
హాస్పిటల్‌: కురంగు తోటలో ఉంది అతిథులకు, బయటి పేదలకు ఉచిత వైద్యం.
పుస్తకాలయము
తెలుగు, ఇంగ్లీషు, తమిళం తదితర భాషల్లో శ్రీరమణులకు సంబంధించిన పుస్తకములు; వారిచే వ్రాయబడినవి; తెలుగు, ఇంగ్లీష్‌, తమిళం తదితర భాషల్లో శ్రీరమణులకు సంబంధించిన పుస్తకములు; వారిచే వ్రాయబడినవి, జీవిత చరిత్రలు, వ్యాఖ్యానాలు స్మృతులు లభిస్తాయి. ఇంకా ఫోటోలు, ఆడియో, వీడియో టేప్‌ – సిడి-డివిడిలు, జ్ఞాపికలు. ద మౌంటెన్‌ పాత్‌ అనే త్రైమాస పత్రిక ఇంగ్లీషులో ప్రచురణ.
ఉదయం 7.30-11, మధ్యాహ్నం 2.30.- 6.30 తెరచి ఉంటుంది.

Sri Ramana Library

This

శ్రీ రమణ గ్రంథాలయము

వంటగదికి, స్టోర్‌రూమ్‌కు మధ్యనుంచి కొండవైపుగా ఉత్తరదిశలో ఉంది. 2012లో నిర్మింపబడి శ్రీరమణులవే కాక, అనేక మార్గాలకు చెందిన ఆధ్యాత్మిక గ్రంథాలు వివిధ దేశభాషలలో వేలాదిగా సమకూర్చబడి వున్నాయి. సందర్శకులను శ్రీ దక్షిణామూర్తి నిండువిగ్రహంతో ఆకర్షిస్తుంది. పుస్తకాలు తీసుకెళ్ళడానికి మెంబర్‌షిప్‌ ఉండాలి.
స్కందాశ్రమం
కొండపైకి 1.4 కి.మీ దూరంలో 30 ని.లో చేరుకోవచ్చు. టౌన్‌లోంచి గిరిహృదయంగా కనబడే ఈ గుహనిర్మాణం పెద్దవృక్షాలతో కప్పబడి చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. భగవాన్‌ ఇక్కడ 1916-22 కాలంలో నివసించారు.
విరూపాక్షగుహ
స్కందాశ్రమానికి కొంచెం కిందుగా మెట్లవెంట దిగి చేరుకోవచ్చు. ఓంకారాకృతిలో ఉండే ఇది విరూపాక్షదేవుల సమాధి. బ్రాహ్మణస్వామిగా పిలువబడే శ్రీరమణులు ఇక్కడ 1899-1916 కాలంలో నివసించారు. ఇక్కడే శ్రీకావ్యకంఠ గణపతిముని (నాయనగారు) వారికి భగవాన్‌ శ్రీరమణమహర్షి అని నామకరణం చేసారు.

శ్రీరమణాశ్రమం ఈ రెండు స్థలాలను సాధకుల ధ్యానం కొరకు సంరక్షిస్తోంది. ఇవి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 4 గం.వరకు తెరచిఉంటాయి.

Optimization WordPress Plugins & Solutions by W3 EDGE