jQuery(document).ready(function($){$('#aside #lang_sel_list ul').addClass('fancy');});

Your browser (Internet Explorer 7 or lower) is out of date. It has known security flaws and may not display all features of this and other websites. Learn how to update your browser.

X

Navigate / search

బోధ

ఉపదేశం

మహర్షి రమణుల ఉపదేశ సారాంశమంతా ‘నేనెవడను?’ అనే చిన్న పుస్తకంలో పొందుపరచబడింది. ఇది వారు మొదటిసారిగా ఒక భక్తునికిచ్చినది. వారి ఆత్మసాక్షాత్కార అనుభవంనుంచి సూటిగా వెలువడినది. శివప్రకాశం పిళ్ళై అనే భక్తుని ప్రశ్నలకు తానిచ్చిన సమాధానాలకు మహర్షి వచనరూపం ఇచ్చారు.

వీటిని ఆచరించినవారికి అవి ఎంత శక్తిమంతమైనవో తెలుస్తుంది. శ్రీరమణ భాషణములు (నెం 80) లో ఇలా ఉంది: ఈ తలపులు ఎవరికో కనుక్కో. ఎక్కడినుంచి వస్తున్నాయి? అవి ఎరుకలోనుంచే రావాలి. ఈ మాత్రం గుర్తిస్తేనే చాలు. అహంకార నాశనం సులభం అవుతుంది. ఆపై అనంతసత్తా యొక్క అనుభూతి కలుగుతుంది. ఆ స్థితిలో శాశ్వతసత్తా తప్ప వ్యక్తులుండరు. కాబట్టి దుఃఖం, చావు అనే ఆలోచనలుండవు.

 

Click to Download
Click to Download

నేనెవడను?

ప్రతివారు దుఃఖం అనేది లేక ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతివానికి తనయందే పరమప్రీతి ఉంటుంది. ఆ ప్రీతికి సుఖమే కారణం. మనస్సు అణిగిపోయిన నిద్రలో ప్రతిరోజు అనుభవించే తనకు స్వాభావికమైన సుఖాన్ని పొందాలంటే తనను తాను తెలుసుకోవాలి. ఆ జ్ఞానం పొందాలంటే ‘నేనెవడను?’ అనే జ్ఞానవిచారణ ముఖ్యసాధనం. ‘నేనెవడను?’ నేను స్వచ్ఛమైన ఎరుకను. ఈ ఎరుక స్వాభావికంగానే సత్‌-చిత్‌-ఆనందం. ‘తెలుసుకో’డానికి పరికరం, అన్ని పనులకు ఆధారం అయిన మనస్సు అణగిపోతే చూడబడే ప్రపంచం అణగిపోతుంది. క్రీనీడలో తాడుని చూచి ఓ మనిషి పాము అని భ్రమపడి భయపడ్డాడు నిష్కారణంగా. ఆ భయం పోవాలంటే ముందు తాడునందు పాముదృష్టి పోవాలి. అలాగే ప్రపంచం వాస్తవిక సత్యం అనే భ్రమ పోతేనే గానీ, దానికి ఆధారమై, దేనియందు అది దృశ్యమానం అవుతోందో అనగా కనబడుతోందో అట్టి ఆత్మయొక్క దర్శనం లభించదు.

మనస్సు ఆత్మలో నెలకొన్న ఒక అతిశయ శక్తి. అదే తలపులను కల్పించేది.  ఆలోచనలు లేని మనసంటూ ప్రత్యేక వస్తువు లేదు. కాబట్టి ఆలోచనలే మనస్సు యొక్క స్వరూపం. ఆలోచనలకంటే వేరుగా ప్రపంచమనేదీ లేదు. నిద్రలో ఆలోచనలూ లేవు, ప్రపంచం లేదు. జాగ్రత్‌ (మెలకువ), స్వప్నము (కల)లలో తలపులూ ఉన్నాయి, ప్రపంచమూ ఉంది.

సాలెపురుగు తనలోంచే దారాలను బయటకు తీసి గూడును అల్లి, దానిని తిరిగి తనలోనికే తీసుకుంటుంది. అలాగే, మనస్సు తనలోంచి ఇంత ప్రపంచాన్ని బయటకు నిర్మించి మరల తనలోనికి విలీనం చేసుకుంటుంది. మనస్సు ఆత్మను విడిచి బయటకు పోయినపుడల్లా ప్రపంచం కనబడుతుంది. అలా, ప్రపంచము తోచినపుడు ఆత్మ కానరాదు. ఆత్మ అనుభవమైనపుడు ప్రపంచము కనబడదు.

మనస్సుయొక్క స్వరూపాన్ని వదలక అన్వేషిస్తే మనస్సు అణగారి, ఆత్మగా మిగులుతుంది. మనసెప్పుడూ ఒక స్థూలవస్తువు (శరీరం)ను ఆశ్రయించి

ఉంటుంది. అది ఒంటరిగా మనలేదు. మనస్సునే సూక్ష్మరూపం, జీవుడు అంటారు. శరీరంలో ‘నేను’ అని తోచేదే మనస్సు. ఈ ‘నేను’ అనే ఆలోచన దేహంలో ఎక్కడ మున్ముందుగా తోస్తుందని విచారిస్తే, హృదయంలో అని తేలుతుంది. అదే మనస్సు పుట్టుచోటు. ”నేను-నేను” అని స్మరించినా అక్కడికి చేరుకోవచ్చు. మనస్సులో తోచే తలపులన్నింటిలోకి ‘నేను’ అనే తలపే మొదటిది. ఇది లేచిన తరువాతే ఇతర తలపులు వస్తాయి.

‘నేనెవడను’ అనే విచారణ చేతనే మనస్సు అణిగేది. ఈ విచారణ ఇతర ఆలోచనలను నాశనం చేసి చితిమంటకు వాడే కట్టెవలె తానుకూడా నశిస్తుంది. ఆత్మ సాక్షాత్కరిస్తుంది. ఇతర తలపులెన్ని తోచినా వాటిని పట్టించుకోక, ఒడుపుగా  ”అవి కలిగినది ఎవరికి?” అని విచారించాలి. ఎన్ని తలపులు పుడితే మనకేం, ఒక్కొక్క తలపును పట్టుకొని, ”ఇది ఎవరికి కలిగింది?” అని విచారిస్తే, ”నాకు అని తోస్తుంది. అప్పుడు ”నేను ఎవరు” అని మరల మరల ప్రశ్నించగా మనస్సు తన పుట్టుక స్థానానికి మరలుతుంది. పుట్టిన ఆలోచన కూడా అణగిపోతుంది. ఇలా అభ్యాసం చేయగా, చేయగా మనస్సుకు తన జన్మస్థానంలో నిలిచి

ఉండగలిగే శక్తి పెరుగుతుంది. సూక్ష్మమైన మనస్సు మెదడు, ఇంద్రియాల ద్వారా బహిర్గతమై, బయటకు పోయేటపుడు స్థూలమైన నామరూపాలు అనుభవమౌతాయి. మనస్సు స్వస్థానమైన హృదయంలో నిలకడ చెంది

ఉన్నపుడు నామరూపాలు తోచట్లేదు. మనస్సునిలా బయటకు పోనీక డెందమందు నిలిపి ఉంచుటనే ‘అహం-ముఖము లేక ‘అంతర్ముఖము’ అంటారు. మనస్సును ఎదలోంచి బాహ్యానికి పోనిచ్చుటను ‘బహిర్ముఖము’ అంటారు. మనస్సు ఎడదలో కుదురుగా ఉంటే అన్ని తలపులకు మూలమైన ‘నేను’ పోయి, ఎప్పుడూ

ఉన్నట్టుండే ‘తాను’ తోస్తుంది. ‘నేను’ అనే తోపకం సుంతైనా లేని స్థితి, అనుభూతియే స్వరూపము, ఆత్మ.

మనస్సును శాశ్వతంగా అణగార్చటానికి విచారణకంటె వేరుమార్గాలు లేవు. ఒకవేళ ఇతర ఉపాయాలచేత అణగినా, మనస్సు అణిగినట్లే అణిగి, తిరిగి లేచి కూర్చుంటుంది. ప్రాణాయామంచేత మనస్సును శాంతపరచవచ్చు. అయితే ఈ కుదురు ప్రాణం నిరోధమై ఉన్నంతసేపే. నిరోధం సడలి, ప్రాణం చలించగానే మనస్సు కూడా తిరుగాడటం మొదలెడుతుంది.

ప్రాణాయామంలాగే దేవతామూర్తి (రూప) ధ్యానం, మంత్రజపం, ఆహార నియమం మొదలైనవి మనస్సును తాత్కాలికంగా నియమిస్తాయి. వీటివల్ల మనస్సుకు ఏకాగ్రత లభిస్తుంది. ఏకాగ్ర చిత్తానికి ఆత్మవిచారం సులభం. నియమాలు అన్నిటిలోకి మితసాత్త్విక ఆహారనియతి శ్రేష్ఠమైనదై, మనస్సుయొక్క సాత్త్విక సత్తువను పెంపొందించి ఆత్మవిచారానికి తోడ్పడుతుంది.

ఒకడు ఎంత పాపి అయినాకానీ, స్వరూప ధ్యానంలో పట్టుదల కలవాడైతే అతడు నిశ్చయంగా కడతేరతాడు.

ఇతరులెంత దుర్మార్గులుగా కనబడినా, వారిని ద్వేషింపరాదు.

ప్రాపంచిక విషయాలలోను, ముఖ్యంగా ఇతరుల వ్యవహారాలలోను మనస్సును వీలైనంతగా పోనీయరాదు.

ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే, ఈ సత్యం తెలిస్తే ఇతరులకు ఈయని వారెవరు?

‘నేను’ లేస్తే సమస్తం లేస్తుంది. ‘నేను’ అణగారితే సకలం శాంతిస్తుంది. మనం ఎంతగా అణకువతో ప్రవర్తిస్తామో, అంతకంత శుభమే జరుగుతుంది. మనస్సు వశమైతే ఎక్కడైనా బతకచ్చు.

యథార్థంగా నిలిచి ఉండేది ఆత్మ ఒక్కటే. జగత్తు (ప్రపంచం), జీవుడు, ఈశ్వరుడు ముత్యపుచిప్పలో వెండి కనబడినట్లే, ఆత్మస్వరూపంలో కల్పితాలు. ఈ మూడు ఒకేసారి ప్రకటమై, ఏకకాలంలో మరుగవుతున్నాయి. స్వరూపమే ప్రపంచం, స్వరూపమే నేను, స్వరూపమే దేవుడు – అంతా శివస్వరూపమైన ఆత్మయే.

ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (తలపులు, ఆలోచనలు) పుట్టుటకు కొంచెమైనా తావీయక, ఆత్మనిష్ఠాపరుడై ఉండటమే తనను తాను దేవునికి అర్పించుకోవడం. ఈశ్వరునిపై ఎంత భారం మోపినా ఆయన దానిని భరిస్తాడు. సర్వకార్యాలను ఒక పరమేశ్వర శక్తి నడుపుతున్న కారణంగా దానికి మనం లోబడి వుండాలి. అంతేకానీ, ‘అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి’ అంటూ ప్రణాళికలు దేనికి? రైలుబండి సామానులన్నీ మోస్తుందని తెలిసికూడా, ప్రయాణీకులమై ఉండి, మన చిన్నమూటను కూడా అందులో పడవేసి హాయిగా ఉండక దానిని నెత్తికెత్తుకుని ఈసురోమనడం ఎందుకు?

 

Optimization WordPress Plugins & Solutions by W3 EDGE